కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో నేడు (శనివారం) ట్రాఫిక్ ఆంక్షలు (Hyderabad Traffic Restrictions) అమలు చేయనున్నారు. గురునానక్ దేవ్ 557వ జయంతి సందర్భంగా నగరంలో మతపరమైన ఊరేగింపు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 వరకు ఈ ఊరేగింపు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు చేయనున్నాయి.
అశోక్ బజార్ లోని గురుద్వారా నుంచి ఊరేగింపు ప్రారంభమై అఫ్జల్ గంజ్, ఎస్ఏ బజార్, ఎంజే మార్కెట్, పుత్లీబౌలీ మీదుగా శంకర్ షేర్ వరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి గురుద్వారాకు చేరుకోవడంతో ఊరేగింపు కార్యక్రమం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఈ విషయం గమనించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఆంక్షలు (Hyderabad Traffic Restrictions) అమలులో ఉన్న ఆయా మార్గాల్లో ప్రయాణించే వారు ప్రత్నామ్యాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.

