వివాహిత హ‌త్య కేసు.. మ‌రో ముగ్గురు అరెస్ట్‌

​కలం, ఖమ్మం బ్యూరో: కులాంతర వివాహం చేసుకుందనే కారణం నిండు ప్రాణాన్ని, పచ్చని సంసారాన్ని బలి తీసుకున్న ఘటనలో నిందితుడికి సహకరించి మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించిన మరో ముగ్గురిని కొత్తగూడెం (Kothagudem) త్రీ టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడి తండ్రి, సోదరుడితో పాటు ఒక స్నేహితుడు ఉన్నారు.

​అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన బోడా నరేందర్ 2025లో గంగారపు భవానీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఇది కులాంతర వివాహం కావడంతో నరేందర్ తండ్రి బోడా హరిలాల్, సోదరుడు బోడా సురేందర్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు. కుటుంబంలో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో భవానీని వదిలించుకోవాలని నరేందర్‌పై కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు.

ప్లాన్‌ ప్రకారం హత్య.. ఆధారాల మాయం!

కుటుంబ సభ్యుల ఒత్తిడితో నరేందర్ తన తండ్రి, సోదరుడితో కలిసి భార్యను హత్య చేసేందుకు పథకం రచించాడు. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీ రాత్రి భవానీని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తండ్రి హరిలాల్ సహాయంతో గోలియతండా గ్రామ శివారులోని తమ పత్తి చేనులో గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ​అయితే, మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో విషయం ఎక్కడ బయటపడుతుందోనని నిందితులు భయపడ్డారు. దీంతో మరుసటి రోజు రాత్రి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని శుభ్రం చేసి, దుస్తులు మార్చి, రెండు తెల్లని ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి బైక్‌లపై భద్రాచలం వైపు తరలించారు. నరేందర్, అతని తండ్రి హరిలాల్ ఒక బైక్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లగా.. సోదరుడు సురేందర్, స్నేహితుడు మాలోత్ శోభన్ మరో బైక్‌పై ముందుగా వెళ్తూ పోలీసుల గస్తీ వివరాలను అందిస్తూ ఎస్కార్ట్‌గా వ్యవహరించారు. అనంతరం భద్రాచలం పాత వంతెన సమీపంలోని గోదావరి నదిలో మృతదేహాన్ని పడవేసి తిరిగి గ్రామానికి చేరుకున్నారు.

​మిస్సింగ్ కేసుతో వీడిన మిస్టరీ!

భవానీ కనిపించడం లేదంటూ ఆమె అక్క స్వరూప నవంబర్ 6న కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ప్రధాన నిందితుడు నరేందర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడిని గతంలోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తదుపరి దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు ఈ నేరంలో మిగిలిన ముగ్గురి పాత్రను నిర్ధారించారు. పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న బోడా హరిలాల్, బోడా సురేందర్, మాలోత్ శోభన్‌లను శనివారం ఉదయం లక్ష్మీదేవిపల్లి మండలంలోని 33/11 KV సబ్‌స్టేషన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ ఆదినారాయణ, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు యాయాతి రాజు, రమేష్‌తో పాటు సిబ్బంది రాజు, మురళి, చిరంజీవిలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>