కలం, నల్గొండ : నల్లగొండలో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు (AIKS National Conference) చారిత్రాత్మక విజయాన్ని సాధించాయని, ఈ సభలు రైతాంగ ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని నింపాయని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. భవిష్యత్తులో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.
దొడ్డి కొమరయ్య భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. మహాసభల్లో రైతాంగ సమస్యలపై 15 తీర్మానాలు ఆమోదించినట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.50 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను రాజకీయాలకు అతీతంగా కాపాడుకోవాలని, అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
మహాసభలకు సుమారు రెండు లక్షల రైతు కుటుంబాలు సహకరించగా, నల్లగొండ జిల్లాలో లక్ష కుటుంబాలు భాగస్వాములయ్యాయని పేర్కొన్నారు. అగ్రిషో ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలు, శాస్త్రీయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర, బీమా, నష్టపరిహారం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, రుణాలు, మార్కెట్ సౌకర్యాలపై తీర్మానాలు చేసినట్లు తెలిపారు.
రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని, కొత్త రుణాలు అందించాలని, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని నాయకులు కోరారు. రైతులు, కార్మికులను కలుపుకొని దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. మహాసభల విజయానికి సహకరించిన ప్రజలు, కార్యకర్తలు, వాలంటీర్లు, అధికారులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

