కలం, వనపర్తి: ఒకప్పుడు గ్రామ ప్రజల జీవనంతో మమేకమైన కేశంపేట గ్రామంలోని పురాతన కోనేరు (Keshampet Pond) ప్రస్తుతం పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. కోనేరును పరిరక్షించి, శుభ్రపరిచి పాత రూపాన్ని తీసుకురావాలనే సంకల్పంతో గుడిబడి సేవా సమితి, భాగ్యనగరం ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. కోనేరులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామానికి వారసత్వ సంపదగా నిలిచిన పురాతన కోనేరును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదానంలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాదేపల్లి రేవతి, సురేష్‌గౌడ్, గుడిబడి సేవా సమితి సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పురాతన కోనేరుకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు భవిష్యత్‌లోనూ దాని పరిరక్షణకు గ్రామస్థులంతా కలిసి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

