కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : తెలంగాణ రాజకీయాలలో మహిళా నాయకత్వానికి మరింత ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల కవితను (Kavitha) చూడాలని ఆశిస్తున్నట్లు సీనియర్ నాయకురాలు సాజిదా సికిందర్ (Sajida Sikander) పేర్కొన్నారు.
ఆదివారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ ప్రాంతంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నందెల్లి ప్రభాకర్ జెండా ఆవిష్కరించారు. జిల్లా ఇన్‌చార్జ్ మెట్టుకాడి ప్రభాకర్, జీ టి కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆశయాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు పార్టీ కృషి కొనసాగుతోందని తెలిపారు. సాజిదా సికిందర్ మాట్లాడుతూ మహిళల సాధికారత, సామాజిక న్యాయం, ప్రజా సమస్యల పరిష్కారంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలలో కల్వకుంట్ల కవిత అందిస్తున్న సేవలు విశిష్టమైనవని, ఆమె నాయకత్వం మహిళలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
అదేవిధంగా, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని నేతలు వెల్లడించారు. ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ టిఆర్ఎస్ అబ్జర్వర్ సౌజన్య రెడ్డి మహేందర్ జీ, అంబాజీ, సురేష్, సాజిదా, సికిందర్, హబీబున్నిసా, అబ్దుల్ నయీమ్, జడ్చర్ల నాయకుడు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

