కలం, నిర్మల్: వర్షాకాలంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిర్మల్ ఎస్‌ఈ (Nirmal SE) జాదవ్ సుభాష్ (Jadhav Subhash) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షం సమయంలో తడిసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తెగిపోయిన లేదా వేలాడుతున్న విద్యుత్ తీగలను తాకరాదని, తడి చేతులతో విద్యుత్ పరికరాలను ఉపయోగించవద్దని సూచించారు. రైతులు వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లకు సరైన ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ లైన్ల కింద ఇనుప పైపులు ఎత్తేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అలాగే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పిల్లలను ఆడనివ్వకూడదని, పశువులను కట్టరాదని తెలిపారు. విద్యుత్ లైన్లలో లోపాలు లేదా తెగిపోయిన తీగలు కనిపిస్తే వెంటనే టీజీఎన్‌పీడీసీఎల్ టోల్‌ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలని కోరారు.

