కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని లింగాపూర్ (Lingapur) గ్రామంలో గత నాలుగు రోజులుగా భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ‘చిరుతల రామాయణ’ ప్రదర్శనలు నేటితో ముగిశాయి. ఈ కార్యక్రమ ముగింపు సందర్భంగా ఆదివారం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత కన్నులపండువగా నిర్వహించారు.
పురాతన కళకు ప్రాణం పోస్తూ.. లింగాపూర్ గ్రామానికి చెందిన స్థానిక కళాకారులు రామాయణంలోని వివిధ ఘట్టాలలో తమ అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ప్రతి ఒక్క కళాకారుడు తమతమ పాత్రల్లో లీనమై, జీవం పోస్తూ ప్రదర్శన ఇవ్వడం విశేషం. మరుగున పడిపోతున్న పురాతన, జానపద కళలను బతికించుకునేందుకు లింగాపూర్ గ్రామ కళాకారులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని పలువురు గ్రామస్తులు, భక్తులు ఎంతగానో అభినందించారు.
ఈ అద్భుత ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం ప్రముఖ గురువులు, మహారాజశ్రీ అలివేలు సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత క్రమశిక్షణతో జరిగింది. అలాగే, ఈ కార్యక్రమానికి కోడూరు తిరుపతి ప్రత్యేక పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఈ ప్రదర్శనలో కేవలం లింగాపూర్ గ్రామ కళాకారులే కాకుండా, పరిసర ప్రాంతంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ఉత్తమ కళాకారులు కూడా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని తరించి, కళాకారులను ఘనంగా సత్కరించారు.

