epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అక్ర‌మార్కుల అంతుచూస్తున్న ఏసీబీ.. సంచ‌ల‌నంగా వార్షిక నివేదిక‌

క‌లం వెబ్ డెస్క్ : తెలంగాణ‌లో అవినీతి నిరోధ‌క శాఖ (Telangana ACB) అధికారులు అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌డుతున్నారు. లంచాల‌ పేరెత్తితే కేసులు, అరెస్టుల‌తో భ‌యం పుట్టిస్తున్నారు. బుధవారం ఏసీబీ 2025 వార్షిక‌ నివేదిక‌(Annual Report)ను ఏసీబీ డీజీ చారుసిన్హా ఎక్స్ వేదికగా విడుద‌ల చేశారు. 2025 సంవత్సరంలో తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ‌ మొత్తం 199 కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో 273 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 157 ట్రాప్ కేసుల్లో 224 మందిని అరెస్ట్ చేయ‌గా వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న‌ట్లు తెలిపారు.

మ‌రో 26 కేసులు ప్రభుత్వ ఉద్యోగుల నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించినవిగా తెలిపారు. ఈ కేసుల్లో 34 మందిని అరెస్ట్ చేశారు. ఏసీబీ 26 సాధారణ విచార‌ణ‌లు చేప‌ట్టింది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ చెక్‌పోస్టులు, వివిధ వెల్ఫేర్ హాస్టళ్లు వంటి కార్యాలయాల్లో 54 ఆక‌స్మిక త‌నిఖీలు చేపట్టింది. ప్రభుత్వం నుంచి 115 సాంక్షన్ ఆర్డర్లు తీసుకొని నిందితులపై కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేసింది. 2025లో నమోదైన 158 ట్రాప్ కేసుల్లో మొత్తం రూ.57,17,500 లంచం డబ్బు పట్టుబడింది. ఇందులో రూ.35,89,500 ఫిర్యాదుదారులకు తిరిగి ఇచ్చారు. 15 అక్ర‌మాస్తుల‌ కేసుల్లో నిందితులకు చెందిన మొత్తం రూ.96.13 కోట్ల విలువైన ఆస్తుల‌ను గుర్తించారు. 2025లో ఏసీబీ సిబ్బందికి శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 73 మంది అధికారులకు ప్రాథమిక ఇండక్షన్ ట్రైనింగ్ ఇచ్చారు. నిందితుల ప్రొఫైల్స్ తయారీ, నిఘా పద్ధతులు, బినామీ ఆస్తుల చట్టం, ఆర్థిక లావాదేవీల గుర్తింపు, డిజిటల్ ఆర్థిక ట్రాక్‌లు, ట్రాప్, డీఏ కేసుల్లో చట్టపరమైన అంశాలు వంటి వాటిపై శిక్షణ ఇచ్చారు.

ఏసీబీ (Telangana ACB) ఇటీవ‌ల డిసెంబర్ 3 నుంచి 9 వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వ‌హించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా ఆధ్వర్యంలో ప‌లు కార్యక్రమాలు చేప‌ట్టారు. అవినీతి ఫిర్యాదుల కోసం క్యూఆర్‌ కోడ్ కంప్లైంట్ సిస్టమ్ ప్రారంభించారు. దీంతో దూర ప్రాంతాల ప్రజలకు సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం ఏర్పడింది. ఎవ‌రైనా లంచాలు అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయాల‌ని ఏసీబీ డీజీ సూచించారు. బాధితులు వాట్సాప్ నెంబర్ 9440446106, ఫేస్‌బుక్, ఎక్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌న్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని హామీ ఇచ్చారు.

Read Also: న్యూ ఇయర్ వేడుకలకు తాడ్వాయికి రండి: మంత్రి సీతక్క

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>