కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఆసరా పెన్షన్ల (Aasara Pension) పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు, అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన లైఫ్ అథెంటికేషన్ ప్రక్రియలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తనిఖీల్లో లక్ష మందికి పైగా అనర్హులు, మృతుల పేర్లపై అక్రమంగా పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందుతున్న వారి పేర్లను పెన్షన్ల జాబితా నుండి ప్రభుత్వం తక్షణమే తొలగించింది.
ఈ ప్రక్షాళన ద్వారా మిగిలిన నిధులను నిజమైన పేదలకు చేర్చాలనే ఉద్దేశ్యంతో, ఇప్పటికే పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్న 2 లక్షల మందితో పాటు, తాజాగా మరో లక్ష మంది అర్హులను ఈ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో మొత్తం 3 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అర్హుల గుర్తింపు, పరిశీలన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన తర్వాత తుది జాబితాను విడుదల చేసి, నూతన లబ్ధిదారులకు కొత్త పెన్షన్ల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు.

