కలం, నాగర్ కర్నూల్: ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని ఆచరణలో చూపిస్తూ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) ఫిట్‌నెస్‌పై తనకున్న మక్కువను చాటుకున్నారు. ఆదివారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిలో ఆయన 70 ఏళ్ల వయస్సులో ఒక గంట 20 నిమిషాల పాటు విరామం లేకుండా ఈత కొట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మనిషి సంపాదించే సంపద కంటే ఆరోగ్యమే అతిపెద్ద పెట్టుబడి అని పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిరోజూ కనీసం గంటపాటు యోగ, ధ్యానం, వాకింగ్, జాగింగ్, రన్నింగ్ లేదా స్విమ్మింగ్ వంటి శారీరక శ్రమతో కూడిన పనులు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన సూచించారు.
వ్యాయామం కేవలం శరీర దారుఢ్యానికే కాకుండా, ఒత్తిడిని దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని, అందరూ ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలని ఆయన కోరారు.

