కలం, నిజామాబాద్ బ్యూరో : రోడ్డు పక్కన ధాన్యం, పంట ఉత్పత్తులు ఆరబెట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, పోలీసులు ఎన్నిసార్లు సూచించినా కొన్నిచోట్ల నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఈ నిర్లక్ష్యం ఓ యువతి ప్రాణాన్ని బలిగొంది. నిజామాబాద్ (Nizamabad) జిల్లా మోస్రా (Mosra) మండల కేంద్రంలో రోడ్డుపై వేసిన ధాన్యం కుప్ప (Paddy Heap) ను స్కూటీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న యువతి దేవి రెడ్డి (18) తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
నాందేవ్ వాడకు చెందిన దేవి రెడ్డి తన సోదరితో కలిసి మోస్రాలో (Mosra) బంధువుల ఫంక్షన్‌కు వెళ్లింది. తిరిగి రాత్రి సుమారు 8 గంటల సమయంలో నిజామాబాద్‌కు వెళ్తుండగా, మోస్రా శివారులో రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పను స్కూటీ ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న దేవి రెడ్డి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. తీవ్ర గాయాలైన ఆ యువతిని స్థానికులు వెంటనే మోస్రా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డుపై ధాన్యం కుప్పలు వేయడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Follow Us On : WhatsApp

