కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. కేబినెట్ విస్తరణ (Telangana Cabinet), మంత్రుల శాఖల మార్పులతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై దేశ రాజధాని ఢిల్లీలో నేడు అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశం జరగనుంది. కొత్తగా ఏర్పాటైన టీపీసీసీ సమన్వయ కమిటీ (TPCC Coordination Committee) తన తొలి సమావేశాన్ని ఈరోజు ఢిల్లీలో నిర్వహించబోతోంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు, అధిష్టాన పెద్దలు హాజరుకానున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ చేపట్టాల్సిన కీలక మార్పులపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ కీలక భేటీలో ప్రధానంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవులను ఎవరితో భర్తీ చేయాలి, సామాజిక సమీకరణాలను ఎలా సమతుల్యం చేయాలనే అంశాలపై అధిష్టానం ఒక స్పష్టతకు రానుంది. దీనితో పాటు ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా వారి శాఖలను మార్చే అవకాశం కూడా బలంగా కనిపిస్తోంది.
అలాగే చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ ప్రక్రియను కూడా ఈ సమావేశంలోనే కొలిక్కి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ భేటీ ముగిసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వంలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం జోరందుకుంది.

