కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ఇంధనం దొరక్క విసిగిపోయిన సామాన్య ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నల్లగొండ మహిళా జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ, బంకు యాజమాన్యం కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
గంటల తరబడి ఎదురుచూపులు
గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూసినా ఇంధనం పోయకపోవడంతో ఆగ్రహించిన వాహనదారులు బంకు ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. “జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, బంకు నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. మా వద్ద స్టాక్ లేదని సాకులు చెబుతూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు’ అంటూ నిరసనకారులు మండిపడ్డారు.
భారీగా ట్రాఫిక్ జామ్
ఈ ఆకస్మిక ధర్నా కారణంగా మహిళా జూనియర్ కళాశాల పరిసర ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ పోసే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని, అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న బంకు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ ఆదేశాలను ధిక్కరిస్తున్న వారి లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పెట్రోల్, డీజిల్ పంపిణీని పునరుద్ధరించాలని కోరారు.

