ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. ఎమ్మెల్యే పర్యటనతో బట్టబయలు!

కలం, దమ్మ పేట: ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు కుమ్మరిస్తున్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన తీరు ఎంత దారుణంగా ఉందో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ (MLA Jare Adinarayana) ఆకస్మిక తనిఖీతో తేటతెల్లమైంది. దమ్మపేట మండలం పాకలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఎమ్మెల్యే పర్యటనతో బట్టబయలైంది. విద్యార్థుల చదువుల గుట్టు నేరుగా ఎమ్మెల్యే ముందే దొరికిపోవడంతో ఆయన ఉపాధ్యాయులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాకలగూడెం ప్రైమరీ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా క్లాస్‌రూమ్‌లోకి వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగిన ఆయన, వారి చదువు సామర్థ్యాన్ని పరిశీలించారు. అయితే బోర్డుపై రాసిన అత్యంత సాధారణ పదాలను కూడా కొందరు విద్యార్థులు చదవలేకపోవడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురయ్యారు.

​”విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే.. విద్యాబోధనలో వచ్చే ఫలితం ఇదేనా? అసలు బడిలో ఏం బోధిస్తున్నారు? పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడితే ఎంతమాత్రం సహించేది లేదు” అంటూ ఉపాధ్యాయులను కడిగిపారేశారు. ఈ నిర్లక్ష్యంపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే.. అక్కడికక్కడే జిల్లా విద్యాశాఖ అధికారిణి కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన ఉపాధ్యాయులపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్య నాణ్యతా ప్రమాణాలు పెరిగేలా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>