కలం, జోగులాంబ గద్వాల: ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల మెడలో నుంచి మంగళసూత్రాలను/పుస్తెలతాడు చోరీ చేసిన నిందితుడ్ని గద్వాల రూరల్ పోలీసులు (Gadwal Police) అరెస్టు చేశారు. నిందితుడి నుంచి మంగళసూత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల్లో ఒకరు అరెస్టు కాగ మరొక్కరు పరార్ అయ్యారు. శుక్రవారం గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ లో గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్‌తో కలిసి గద్వాల సీఐ టి. శ్రీను వివరాలు వెల్లడించారు.
మహారాష్ట్రకు చెందిన రితిక్ షిండే, షోయం ఇద్దరు కలిసి గద్వాలలో ప్లాస్టిక్ సామాన్లు అమ్మేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని జమ్మిచేడులో 4, 5వ వార్డులలో ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న బుచ్చమ్మ మెడలోని నల్లపూసల పుస్తెల తాడు, పారిజాతమ్మ మెడలోంచి 2.5 తులాల బంగారు పుస్తెల తాడును అపహరించుకుని పరారయ్యారు. బాధితులు వెంటనే గద్వాల రూరల్ పోలీసులకు అందించారు.
సమాచారం అందుకున్న గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గద్వాల సీఐ టి.శ్రీను ఆదేశాల మేరకు పోలీసులు గద్వాల ఆర్టీసి బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రితిక్ షిండే, షోయం లను తనిఖీ చేసే క్రమంలో షోయం పరారయ్యాడు.
రితిక్ షిండేను అదుపులోకి తీసుకుని విచారించగా, చోరికీ తామే పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. పరారైన మరో నిందితుడు షోయం కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు రితిక్ షిండే వద్ద నుంచి చోరికి గురైన పుస్తెల తాడు, నల్లపూసల పుస్తెల తాడును స్వాధీనం చేసుకుని, రిమాండ్ కు తరలించారు. చోరీ కేసును త్వరితగితిన చేధించిన గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ ను, పోలీస్ సిబ్బందిని గద్వాల సీఐ అభినందించారు.

