కుదేలైన రైతాంగానికి బ్యాంకుల భరోసా!

కలం, యాదగిరిగుట్ట: ఎల్‌నినో ప్రభావం.. ఆశించిన వర్షాలు లేవు.. పంటల దిగుబడులు పడిపోయాయి.. సాగునీటి కొరతతో అన్నదాతలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్న రైతాంగానికి యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా యంత్రాంగం ఊరటనిచ్చే దిశగా అడుగులు వేసింది. జిల్లాలోని 17 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో రైతుల రుణాల పునర్వ్యవస్థీకరణపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Collector Anuraag Jayanti ) బ్యాంకర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరువు కష్టాల్లో ఉన్న రైతులపై రుణాల వసూళ్ల ఒత్తిడి తగదని, బ్యాంకులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం 12 నెలల మారటోరియం కల్పించడంతో పాటు, రుణ చెల్లింపు గడువును 24 నుంచి 60 నెలల వరకు పొడిగించే అవకాశాలను పరిశీలించి అమలు చేయాలని సూచించారు.

పాత అప్పులకు ఊరట.. కొత్త సాగుకు చేయూత..

రుణాల పునర్వ్యవస్థీకరణతోనే సరిపెట్టకుండా, రాబోయే పంటల సాగుకు అవసరమైన కొత్త పంట రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ రుణాలను కూడా సకాలంలో అందించాలని కలెక్టర్ ఆదేశించారు. స్వల్పకాలిక పంట రుణాలను నిబంధనల మేరకు మధ్యకాలిక రుణాలుగా మార్చే ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

రైతులపై వసూళ్ల ఒత్తిడికి చెక్?

కరువు పరిస్థితుల్లో రైతులను రుణాల పేరుతో ఇబ్బందులకు గురిచేయరాదని, ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడకుండా చూడాలని బ్యాంకు అధికారులకు స్పష్టం చేశారు. గ్రామాలు, మండలాల వారీగా అర్హులైన రైతులను గుర్తించి రుణ పునర్వ్యవస్థీకరణ ప్రయోజనాలు అందించాలని వ్యవసాయ శాఖకు సూచించారు. రైతు వేదికలు, గ్రామసభల ద్వారా ఈ పథకాలపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు పంట బీమా పథకాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. కరువు దెబ్బతో ఆర్థికంగా కుంగిపోతున్న అన్నదాతలకు ఈ నిర్ణయాలు ఎంతవరకు ఉపశమనం కలిగిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ మార్గదర్శకాలు, బ్యాంకుల అమలు తీరు, అర్హులైన రైతులకు అందే ప్రయోజనాలపైనే అన్నదాతల ఆశలు నిలిచాయి. బుధవారం నిర్వహించిన ప్రత్యేక డీసీసీ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట్రాంరెడ్డి, డీఆర్డీవో నాగిరెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీధర్, ఆర్బీఐ ఏజీఎం హేమలత, లీడ్ బ్యాంక్ మేనేజర్ వీరన్న, నాబార్డ్ డీడీఎం ఝాన్సీ రాణి కాసర్ల తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>