భద్రాద్రి జిల్లాలో వరుణుడి ప్రళయం

​కలం, దమ్మ పేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాలను ‘మురసు’ తుఫాన్ (Murasu cyclone) తీవ్రంగా వణికిస్తోంది. గత 36 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతూ ప్రళయాన్ని (Bhadradri Floods) సృష్టిస్తున్నాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారులు, చెరువుకట్టలు దెబ్బతినగా, వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది.. తమ సాహసోపేత చర్యలతో వరదల్లో చిక్కుకున్న 10 మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరోలుగా నిలిచారు.

​తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు వద్ద రింగ్ బండ్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. అలాగే దమ్మపేట మండల కేంద్రంలోని పేరంటాల చెరువు కట్ట తెగిపోవడంతో సుమారు 300 ఎకరాల పంట పొలాలు జలమయమయ్యాయి. దమ్మపేట మండలం నెమలిపేట గ్రామాన్ని వరదనీరు పూర్తిగా ముంచెత్తడంతో, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళి స్వయంగా రంగంలోకి దిగారు. అధికారులతో కలిసి ఇళ్లలో బిక్కుబిక్కుమంటున్న ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి సమీప పునరావాస కేంద్రానికి తరలించారు.

​మరోవైపు దమ్మపేట మండలం శ్రీరాంపురం వద్ద మల్లెపూల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న వేళ, ఓ మహిళ వరద నీటిలో చిక్కుకుపోయి ప్రాణభయంతో చెట్టు ఎక్కింది. సమాచారం అందుకున్న SDRF సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, ఎంతో సాహసంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆ మహిళను సురక్షితంగా కాపాడారు. ఇదే సమయంలో ముసళ్లబంధం చెరువుకట్ట తెగిపోవడంతో మల్లెపూల వాగులోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది.

ఈ ప్రమాదకర పరిస్థితుల్లో తొట్టిపంపు గ్రామానికి చెందిన తొమ్మిది మంది పొలం పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా వరద నీటిలో చిక్కుకుపోయారు. గమనించిన SDRF సిబ్బంది వెంటనే అప్రమత్తమై బోటు సహాయంతో ఆ తొమ్మిది మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.​మొత్తంగా ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సంలో ప్రాణాలను పణంగా పెట్టి 10 మందిని ప్రాణాపాయం నుండి తప్పించిన SDRF సిబ్బందిని, అప్రమత్తంగా వ్యవహరించి సహాయక చర్యలు చేపట్టిన అధికారులను బాధితులు, స్థానిక గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>