కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) నగరాభివృద్ధికి ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జీడబ్ల్యూఎంసీ, ఎన్ఐటీ వరంగల్ సంయుక్తంగా కీలక ముందడుగు వేస్తున్నాయి. నగరవ్యాప్తంగా డ్రోన్ సర్వే, త్రీడీ మ్యాపింగ్ చేపట్టి సమగ్ర డిజిటల్ సమాచారాన్ని రూపొందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. దీనివల్ల నగర మౌలిక సదుపాయాలపై కచ్చితమైన సమాచారం అందుబాటులోకి రావడంతో పాటు భవిష్యత్తు అభివృద్ధి పనులకు శాస్త్రీయ ప్రణాళికలు రూపొందించే అవకాశం కలగనుంది.
జీడబ్ల్యూఎంసీ–ఎన్ఐటీ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఎన్ఐటీ ప్రొఫెసర్లు శంకర్, శశి డ్రోన్ సర్వే, త్రీడీ మ్యాపింగ్ విధానాలు, సాంకేతికత, అమలు సాధ్యాసాధ్యాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ప్రజెంటేషన్‌ను పరిశీలించిన కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ (Chahat Bajpai), కమిషనర్ టి.వెంకన్న సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎన్ఐటీ నిపుణులు, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఐటీ మేనేజర్ రమేష్, టౌన్‌ప్లానింగ్ అధికారులు అవినాష్, ప్రశాంత్ పాల్గొన్నారు.

