కలం, స్పోర్ట్స్: ఆసియా ఛాంపియన్స్ (Asian Champions ) ట్రోఫీ 2026లో భారత హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 8-1తో చిత్తు చేసింది. దీంతో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగే ఫైనల్లో జపాన్‌తో తలపడనుంది. మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. మూడో నిమిషంలోనే షిలానంద్ లక్రా తొలి గోల్ చేశాడు. అయితే కొద్దిసేపటికే హాన్ సంగ్జున్ గోల్‌తో కొరియా స్కోరును సమం చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత షిలానంద్ మరో గోల్‌తో స్కోరును 3-1కు చేర్చాడు. రెండో క్వార్టర్లో సుఖ్జీత్ సింగ్ భారత్‌కు నాలుగో గోల్ అందించాడు.
దిల్‌ప్రీత్ సింగ్ వరుసగా రెండు గోల్స్ చేసి ఆధిక్యాన్ని 6-1కు పెంచాడు. మూడో క్వార్టర్లో అంగద్ బీర్ సింగ్ ఏడో గోల్ సాధించాడు. చివరి క్వార్టర్లో వివేక్ సాగర్ ప్రసాద్ మరో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 8-1కు చేరింది. చివరకు భారత్ 8-1తో ఘన విజయం సాధించింది. షిలానంద్, దిల్‌ప్రీత్ చెరో రెండు గోల్స్‌తో రాణించారు. హర్మన్‌ప్రీత్, సుఖ్జీత్, అంగద్, వివేక్ తలో గోల్ చేశారు. మరో సెమీఫైనల్లో మలేషియాపై షూటౌట్లో 5-3తో విజయం సాధించిన జపాన్ ఫైనల్‌కు చేరింది. దీంతో గురువారం భారత్, జపాన్ మధ్య టైటిల్ పోరు జరగనుంది. భారత్ ఆరోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంపై దృష్టి పెట్టింది.

