కలం, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamil Nadu)లో నీటి సమస్యతో విసుగెత్తి పోయిన మహిళలు వినూత్న నిరసనకు దిగారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావికి ఏకంగా అంత్యక్రియలు నిర్వహించి తన సమస్యను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పుదుక్కొట్టై జిల్లాలోని ఎల్లైత్తరప్పట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గత మూడు సంవత్సరాలుగా చుక్క నీరు రాకుండా నిరుపయోగంగా పడి ఉన్న ఆ బోరుబావిని బాగు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో మహిళలు ఈ విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ బోరుబావి పని చేయకపోవడంతో రోజు ఏకంగా 5 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరణించిన మనిషికి చేసినట్లుగానే ఆ బోరుబావికి పూలమాలలు వేసి, శాస్త్రోక్తంగా పూజలు జరిపి ఈ అంత్యక్రియల నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆలోచింపజేస్తోంది. మరి మహిళల నిరసనతో ప్రభుత్వం స్పందిస్తుందో ?లేదో ? వేచి చూడాలి.

