కలం, వరంగల్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ (Collector Chahat Bajpai ) పై మోయలేనంతగా భారం పెట్టింది. జిల్లాకు ప్రధానమైన పోస్టులో కొనసాగుతున్న ఆమెకు మరో నాలుగు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ప్రస్తుతం జిల్లాలో అనేక సమస్యలు వెంటాడుతున్న నేపథ్యంలో అదనపు బాధ్యతలు ఇబ్బందిగా పరిగణించినట్లు తెలుస్తోంది. దీంతో రోజువారీ పాలన కుంటుపడుతోందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.
‘అదనపు’ భారం
ప్రస్తుతం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఇన్‌చార్జి వైస్ ఛైర్మన్, వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ సీఈఓ, జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వాహిస్తున్నారు. అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐదు కీలక పోస్టులు చూడడమంటే మామూలు విషయం కాదనే వాదనలున్నాయి.
ముందుకు సాగని పాలన
కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కు మరో నాలుగు కీలక బాధ్యతలు అప్పగించడం సుపరి పాలనకు ఆటంకంగా మారిందనే అభిప్రాయాలు లేకపోలేదు. ఉదయం పూట కలెక్టరేట్, మధ్యాహ్నం మున్సిపాలిటీ , సాయంత్రం కుడా రివ్యూ ఈ విధంగా ఒక్కో డిపార్ట్‌మెంట్‌కు కనీసం రెండు గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. దీంతో ఆయా శాఖలకు చెందిన ఫైల్స్ పెండింగ్ లో పడిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రెవెన్యూ ఫైల్స్, పింఛన్, రైతుబంధు, దళితబంధు అప్లికేషన్లు నెలల తరబడి పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఆయా ఫైల్స్ పై సంతకం పెట్టే ఆఫీసర్ దొరకడం లేదని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కలెక్టర్ గ్రామాల్లోకి వెళ్లి ప్రజా సమస్యలు వినే టైం ఉండడం లేదని, అన్నీ జూమ్ మీటింగ్‌లతో సరిపెడుతున్నట్లు తెలుస్తోంది.
గ్రీవెన్స్ పెండింగ్
కలెక్టర్ లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కు సుమారు 300 వరకు అర్జీలు వస్తే, 50 కూడా పరిష్కారం కావడం లేదనే ప్రచారం జరుగుతోంది. స్మార్ట్ సిటీ పనులు కూడా నెమ్మదించినట్లు సమాచారం. రోడ్లు, డ్రైనేజీ, పార్కుల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో పనులు నిలిపేసే పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం.
భూ సమస్యలతో తలనొప్పి
హనుమకొండ జిల్లాలో భూ సమస్యలు ఎక్కువే. ప్రభుత్వ భూములు, పార్కులు, నాలాలు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. కలెక్టర్ బిజీగా ఉండడంతో ధరణి సమస్యలు, సాదా బైనామా, పట్టాదారు పాస్‌బుక్ తప్పులు సరిచేయడానికి ఆర్ డీ ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తోందని భాదితులు పేర్కొంటున్నారు.ఇటీవల హనుమకొండ పట్టణంలోని న్యూ శాయంపేట సర్వే నెం.23 లోని 4 ఎకరాల భూమి కబ్జా గురైంది. ఈ ఘటనలతో స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ భూముల రక్షణ టాస్క్ ఫోర్స్ కమిటీ ని ఏర్పాటు చేశారు. ఆర్డీవో, ఏసీపీ, ఇరిగేషన్, మున్సిపల్, కుడా, సర్వే ఆఫీసర్లతో ఆరు మంది టీం వేశారు. ఈ మేరకు కలెక్టర్ ప్రతి రోజూ రివ్యూ చేయాల్సి వస్తోంది. ఇది కూడా అదనపు భారంగా మారినట్లు తెలుస్తోంది.
అధికారుల కొరత తీరేదెన్నడు..?
హనుమకొండ జిల్లాను అధికారుల కొరత వెంటాడుతోంది. జిల్లాకు గుండె కాయలాంటి శాఖలకు చెందిన అధికారులు లేకపోవడంతో పాలన కుంటుపడుతోందనే విమర్శలున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్, కుడా వైస్ చైర్మన్ పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వం కొత్త అధికారులను నియమించని కారణంగా కలెక్టర్‌కే అదనపు బాధ్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వెంటనే ఆయా శాఖలకు ఫుల్ టైం అధికారులను నియమించకపోతే జిల్లా పాలన మరింతగా కుంటుపడే ప్రమాదం ఉందని ప్రజలు సూచిస్తున్నారు.

