కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో జరిగిన తగాదా కత్తులతో దాడులు చేసుకునేంతగా ముదిరి, ఒకరి ప్రాణం తీయగా.. మరొకరిని తీవ్ర గాయాలపాలు చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సంగారెడ్డి పట్టణంలోని సితార థియేటర్ సమీపంలో ఉన్న జలాల్బాగ్ ఓపెన్ గ్రౌండ్లో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించేందుకు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో వారి మధ్య చిన్నపాటి మాటమాట పెరిగి తీవ్ర వివాదానికి దారితీసింది. ఆవేశంతో రగిలిపోయిన ఒకరు తమ వద్ద ఉన్న కత్తులతో మిగిలిన ఇద్దరిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
ఈ కత్తిపోట్ల దాడిలో పాజిల్ (45) అనే వ్యక్తి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడిలో బిలాల్ (38) అనే మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని కంది గ్రామానికి చెందిన రహీంగా పోలీసులు గుర్తించారు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న సంగారెడ్డి పోలీసులు పరిస్థితిని సమీక్షించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు రహీం కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

