కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలకు నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 4,023 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో డీఎంకే 164 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేస్తోంది. అన్నాడీఎంకే 169, బీజేపీ 27 స్థానాల్లో బరిలో ఉన్నాయి. ఇక విజయ్ పార్టీ టీవీకే 234 స్థానాల్లో పోటీలో ఉంది. తమిళనాడులో నేడు జరుగుతున్న ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో 5.73 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఓటేసిన ప్రముఖులు..
తమిళనాడులో పలు చోట్ల పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటి నుంచే సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ నటి, బీజేపీ నాయకురాలు, ఖుష్బూ దంపతులు, నటుడు అజిత్ కుమార్, కమల హాసన్, శృతి హాసన్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ చిదంబరం, మాజీ గవర్నర్ తమిళిసై తదితరులు ఓటు వేశారు. ఇక కొన్ని చోట్ల పోలింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తిరువారూర్, తిరుచ్చి, ఈరోడ్ సహా పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ మొదలవ్వలేదు. అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటున్నారు.

