కలం, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో టీమిండియా (T20 Cricket) ఘోరంగా విఫలమైంది. గెలుపుపై గంపెడంత ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. బ్యాటింగ్‌లో పట్టు కోల్పోయిన భారత్, దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 188 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ కావడం చర్చనీయాంశంగా మారింది.
భారత ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పతనం దిశగా సాగింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ (15) మరోసారి తన అట్టర్ ప్లాప్ ప్రదర్శనను కొనసాగించాడు. వన్ డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (1) సైతం క్యాచ్ ఇచ్చి త్వరగానే నిష్క్రమించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18), వాషింగ్టన్ సుందర్ (11) వికెట్లను కార్బిన్ బాష్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కేశవ్ మహారాజ్ తన స్పిన్ మాయాజాలంతో హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్‌లను పెవిలియన్ పంపి భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు.
శివమ్ దూబే ఒక్కడే కాసేపు పట్టుదలగా నిలబడి 37 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అయితే జట్టును గట్టెక్కించే ప్రయత్నంలో ఆఖరిలో స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో భారత్ కథ ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ 3 వికెట్లతో రాణించగా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
సఫారీ ఇన్నింగ్స్: మిల్లర్ మెరుపులు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కూడా ఆరంభంలో తడబడింది. మార్‌క్రమ్ (4), డికాక్ (6) వికెట్లను బుమ్రా త్వరగానే తీశాడు. అయితే డేవిడ్ మిల్లర్ (63), డెవాల్డ్ బ్రెవిస్ (45) విన్నూత్న ఇన్నింగ్స్‌తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో సఫారీలు 187 పరుగుల భారీ స్కోరు సాధించారు. భారత బౌలర్లలో బుమ్రా (3/15) అత్యుత్తమ ప్రదర్శన చేసినా, బ్యాటర్ల వైఫల్యంతో అది వృథా అయింది.
ఇక రానున్న మ్యాచ్‌లే కీలకం
సూపర్-8 దశలో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడంతో, సెమీస్ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లను తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ ఓటమిపై సోషల్ మీడియాలో భారీ విమర్శలు వస్తున్నాయి. ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్న చందంగా భారత్ ఆటతీరు ఉందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి తదుపరి మ్యాచ్‌ల్లోనైనా టీమిండియా తన తప్పులు సరిదిద్దుకుని పుంజుకుంటుందో లేదో చూడాలి.


