కలం, నల్లగొండ బ్యూరో: రానున్న బత్తాయి సీజన్‌కు ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న బత్తాయి మార్కెట్‌ను సిద్ధం చేయాలని నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం అయన బత్తాయి మార్కెట్‌పై ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బత్తాయి పంట, బత్తాయి వెరైటీలు, ఉత్పత్తి, విస్తీర్ణం, దిగుబడులు, బత్తాయి సాగు చేస్తున్న రైతులు, బత్తాయి కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బత్తాయి రైతులు (Sweet Lime Farmers) ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఉన్న బత్తాయి మార్కెట్ రైతులకు అందుబాటులో లేనందున ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు రైతులను మోసం చేస్తున్నారన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి బత్తాయి రైతులందరికీ లైసెన్స్ తీసుకునేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అవగాహన కల్పించాలని చెప్పారు. వచ్చే సీజన్‌లో బత్తాయిని ఇక్కడే కొనుగోలు చేసేందుకు బత్తాయి మార్కెట్‌ను సిద్ధం చేయాలని చెప్పారు.
అలాగే బత్తాయిని కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న రైతు ఉత్పత్తి సంస్థ చురుకుగా పాల్గొనేలా చేయాలన్నారు. బత్తాయి మార్కెట్ అనుసంధానంతో పాటు, అవసరమైన సౌకర్యాలను కల్పించాలని, బత్తాయి కొనుగోలుకు అవసరమయ్యే పరికరాలన్నింటిని ముందే సిద్ధం చేసి ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులు ట్రేడింగ్ లైసెన్స్ ఉన్నవారికే బత్తాయి అమ్మే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే మేలు రకం బత్తాయిని సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి, మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి, ట్రేడర్ అబిద్ అలీ, ఎఫ్‌పిఓ వంశీకృష్ణ హాజరయ్యారు.
Read Also: వేసవి వచ్చేసింది.. వార్డ్‌రోబ్‌లో ఈ మార్పులు చేసుకోండి
Follow Us On: Sharechat

