కలం, కరీంనగర్ బ్యూరో : బీసీ సంక్షేమ వసతి గృహాలను (BC Hostels) మూసివేయకుండా యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని.. బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్ రాజు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. కరీంనగర్, హుజూరాబాద్ ప్రాంతాలలోని బీసీ సంక్షేమ వసతి గృహాలను కొనసాగించేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌లోని పాఠశాల స్థాయి బీసీ వసతి గృహంలో ఇప్పటికే 30 మంది విద్యార్థులు రెన్యూవల్ చేసుకున్నారని, కొత్తగా విద్యార్థులు చేరే అవకాశం ఉన్నప్పటికీ భవనం లేదనే కారణంతో అధికారులు హాస్టల్‌ను మూసివేశారని ఆరోపించారు.
దాదాపు 15 ఏళ్ల క్రితం సైదాపూర్‌లో మూతపడిన బీసీ వసతి గృహాన్ని జిల్లా కేంద్రానికి తరలించారని, జిల్లా కేంద్రంలో హాస్టల్ అవసరాన్ని గుర్తించి ఏర్పాటు చేసినా, అధికారులు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి తిరిగి మూసివేశారని విమర్శించారు. అలాగే హుజూరాబాద్‌లోని పాఠశాల స్థాయి బీసీ వసతి గృహాన్ని కూడా మూసివేశారని తెలిపారు. అధికారులు ఇష్టానుసారంగా బీసీ వసతి గృహాలను మూసివేస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల మంథని నియోజకవర్గంలోని ముత్తారం బీసీ వసతి గృహాన్ని కాటారానికి తరలించగా, స్థానిక ప్రజలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాల ఆందోళనలతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించి తిరిగి ముత్తారంకు హాస్టల్‌ను తరలించాలని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే తరహాలో కరీంనగర్ జిల్లాలో కూడా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమించి మూసివేసిన వసతి గృహాలను తిరిగి ప్రారంభించే వరకు పోరాటం కొనసాగించాలని కేశిపెద్ది శ్రీధర్ రాజు పిలుపునిచ్చారు.

