ఏకలవ్య పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

కలం, ఖమ్మం బ్యూరో : రెండు రోజుల్లో మార్పు కనిపించకపోతే ఉద్యోగాలు ఊడతాయని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్ అంకిత్ ఏకలవ్య పాఠశాల సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలోని గుండాల మండలం ముతాపురం గ్రామంలోని ఏకలవ్య పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, తరగతి గదులు, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, కంప్యూటర్ ల్యాబ్ తదితర సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, పాల సరఫరా, పరీక్షల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.

పరిశీలనలో పాఠశాలలో పరిశుభ్రత లోపాలు, కిచెన్ షెడ్‌లో అపరిశుభ్రత, వంట ప్రాంగణంలో నిర్లక్ష్య నిర్వహణ, సిబ్బంది కొరత, కంప్యూటర్ ల్యాబ్ ల దుమ్ము పేరుకుపోవడం, మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడం వంటి అంశాలను గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించిన కలెక్టర్, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “రెండు రోజుల్లో పాఠశాలలో ఉన్న అన్ని లోపాలను పూర్తిగా సరిచేయాలనీ. లేనిపక్షంలో ఏజెన్సీ గుర్తింపును రద్దు చేసి బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతరం గుండాల మండలంలో ప్రభుత్వ సేవల నాణ్యతను సమీక్షించేందుకు జిల్లా (Bhadradri Kothagudem) కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా విద్య, వైద్యం, పశుసంవర్ధక మరియు పరిపాలన రంగాలకు సంబంధించిన పలు సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సమయానికి నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ ఖాసీమ్, మండల ప్రత్యేక అధికారి ఇంతియాజ్ ఖాన్, ఎంపీడీవో బాలరాజు, ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ నితిన్ సింగ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>