కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా జమ్మికుంట (Jammikunta) మండలంలో ఘోరం జరిగింది. అంకుశాపూర్ పరిధిలో ఓ వ్యక్తి రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో ఇది హత్యేనని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామాల మధ్య రోడ్డుపై ఓ వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించి, మృతుడిని అంకుశాపూర్ గ్రామానికి చెందిన ‘మొగిలి’ గా గుర్తించారు.
మొగిలి శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుని, హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఊహించని ఘటనతో అంకుశాపూర్ గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు మొగిలిని హత్య చేసింది ఎవరు? పాత కక్షల వల్ల ఈ దారుణానికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

