కలం,వెబ్ డెస్క్ : వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పరిగి మండలం రావులపల్లికి (Ravulapally) చెందిన 18 ఏళ్ల శిరీష వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిన వ్యక్తే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
స్థానిక సమాచారం ప్రకారం, రావులపల్లికి చెందిన శిరీష మృతదేహం వ్యవసాయ బావిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, తదుపరి విచారణ చేపట్టారు. యువతి ముఖంపై రక్తగాయాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.
చరణ్ అనే యువకుడు ప్రేమ పేరుతో శిరీషను వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన కుమార్తెను హత్య చేసి బావిలో పడేసి ఉంటారని శిరీష తల్లి అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, యువతి మరణానికి గల అసలు కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చరణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరణానికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోపణలు, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

