కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) జిల్లా రాయపర్తి మండలం అవుసులకుంట (ఏకే ) తండాలో నర్సింగ్ విద్యార్థినీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన గురువారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం… ఏ కే తండాకు చెందిన గుగులోత్ రజిత పూల్యానాయక్ దంపతులకు మహేష్, చిట్టి (20) సంతానం. కొద్దిరోజుల కిందట పూల్యానాయక్ దంపతులు హైదరాబాద్ కు వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. మహేష్ మధ్యప్రదేశ్ లో విద్యాభ్యాసం చేస్తుండగా చిట్టీ నర్సంపేట లో నర్సింగ్ కోర్స్ చేస్తూ ఇంటి వద్దనే ఉంటోంది. మృతురాలు రోజు మాదిరిగానే బుధవారం ఉదయం నర్సంపేటలోని కాలేజీ కి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. మరుసటి రోజులు ఉదయం 7 గంటలకైనా నిద్ర లేవక పోయే సరికి అనుమానించిన ఇరుగుపొరుగు వాళ్లు తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్ ఉరి వేసుకుని మృతి చెందింది. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏసీపీ నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే మృతురాలి శరీరం నుంచి తీవ్ర రక్త స్రావం కావడంతో రేప్ జరిగి ఉంటుందని, తట్టుకోలేక చిట్టీ ఆత్మహత్యకు పాల్పది ఉంటుందనీ తండావాసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు ఆ దిశగా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్, ఖమ్మం రహదారి పై బైటయించి ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభీంచినట్లు ఏసీపీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం మార్చురికి తరలించారు.

