కలం, సూర్యాపేట: ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ (Suryapet Police) సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ‘ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్’ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని జిల్లా ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కేవలం ఒక్క ఫోన్ కాల్‌తో సంఘటనా స్థలానికే చేరుకుని పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా, నమ్మకమైన సేవలు అందించడమే ధ్యేయంగా ఈ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టామని ఎస్పీ తెలిపారు.
బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. సమాచారం అందిన వెంటనే పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి, అక్కడికక్కడే ఫిర్యాదులను స్వీకరించి కేసు నమోదు చేస్తారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కేసుల దర్యాప్తు కూడా మరింత వేగంగా, సమర్థవంతంగా జరుగుతుందని ఆయన వివరించారు. సమాజంలో తక్షణ సహాయం అవసరమయ్యే వర్గాలకు మరియు అత్యవసర పరిస్థితులకు ఈ ‘ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్’ విధానం వరంలా మారుతుందని ఎస్పీ పేర్కొన్నారు.
“సమస్య ఎక్కడ జరిగినా… ప్రజలకు పోలీసు సహాయం త్వరగా అందాలన్నదే మా ప్రధాన లక్ష్యం. అత్యవసర సమయంలో ప్రజలు ‘డయల్ 100’ కు గానీ లేదా సంబంధిత పోలీస్ అధికారికి గానీ నేరుగా ఫోన్ చేసి సమాచారం అందిస్తే, సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుంటారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీసుల (Suryapet Police) దృష్టికి తీసుకురావచ్చు.” అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లా పోలీసులు ప్రజలతో స్నేహపూర్వక (ఫ్రెండ్లీ పోలీసింగ్) సంబంధాలు కొనసాగిస్తూ, వారిలో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు.
Read Also: భారీ శుభవార్త.. జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ జీవిత బీమా’
Follow Us On: X(Twitter)

