కలం, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) తొలి మ్యాచ్‌లో యూఎస్ఏతో భారత్ తలపడింది. ఇందులో ఇండియా బ్యాటింగ్ లైనప్ తడబడింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ప్రతి బ్యాటర్ విఫలమయినా సూర్యకుమార్ (Suryakumar Yadav) మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం తొమ్మిది వికెట్లు పడితే.. వాటిలో 8 క్యాచ్ ఔట్లే కావడం విశేషం.
యూఎస్ఏ బౌలర్లలో షాడ్లీ వాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటా ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత హర్మీత్ సింగ్.. నాలుగు ఓవర్ల బౌలింగ్ వేసి 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలీఖాన్, మొహ్సీన్ చెరో వికెట్ తీశారు.
భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తర్వాతి స్థానంలో 25 పరుగులతో తిలక్ వర్మ నిలిచాడు. ఇషాన్ కిషన్ 16 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ మాత్రమే రెండంకెల స్కోర్ (14) చేశాడు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. అభిషేక్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి సున్నా పరుగులకే ఔట్ అయ్యారు. వరుణ్.. ఆఖరి బంతికి పరుగు తీసే క్రమంలో రనౌట్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం అమెరికా ముందు 162 పరుగుల లక్ష్యం ఉంది.
Read Also: ఫైనల్‌కు ముందు నిద్ర పట్టలేదు: వైభవ్ సూర్యవంశీ
Follow Us On: Sharechat


