కలం, స్పోర్ట్స్ : భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించబడిన తర్వాత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తొలిసారి స్పందించాడు. బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌ను కొత్త టీ20 కెప్టెన్‌గా ప్రకటించిన కొన్ని గంటలకే సోషల్ మీడియా ద్వారా తన స్పందనను పంచుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలు, ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్లలో సూర్యకుమార్‌కు చోటు దక్కలేదు. దీంతో కెప్టెన్సీ మార్పుపై చర్చ జరుగుతున్న సమయంలో అతడు పరోక్షంగా స్పందించాడు.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో భారత జట్టు ఫొటోను షేర్ చేసిన సూర్యకుమార్, ముందున్న సవాళ్ల కోసం జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. భారత జట్టు విజయవంతం కావాలని ఆకాంక్షించాడు. ఇదే సమయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక అభినందనలు తెలిపాడు. తన ప్రతిభతోనే వైభవ్ ఈ అవకాశాన్ని సంపాదించుకున్నాడని పేర్కొంటూ, అతడి ప్రయాణాన్ని ఆసక్తిగా గమనిస్తానని వెల్లడించాడు.
కాగా, టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ అయిన సూర్యకుమార్‌ను మార్చడం సులభమైన నిర్ణయం కాదని ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వ్యాఖ్యానించాడు. అయితే ఇటీవల అతడి ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఈ నిర్ణయానికి ఒక కారణంగా భావిస్తున్నారు.

