కలం, ఖమ్మం బ్యూరో: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడమే లక్ష్యంగా అధికారులు రంగంలోకి దిగారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో గురువారం ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లి (Sathupalli) పట్టణంలో అధికారులు విస్తృత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి, వ్యవసాయ శాఖ ఇంచార్జి ఏవో సుజాత నేతృత్వంలోని బృందం స్థానిక ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాలతో పాటు నవతా ట్రాన్స్‌పోర్ట్‌ను తనిఖీ చేసింది.
దుకాణాల్లోని విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలు, లైసెన్సులు, బిల్లుల నిర్వహణను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్యాకెట్లపై ఉన్న తయారీ, గడువు తేదీలను, ప్రభుత్వ నిబంధనల అమలును ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. రైతులు తాము కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులు లేదా పురుగుల మందులకు సంబంధించిన ప్రతిదానికీ తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమానాస్పద విక్రయాలపై తక్షణమే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
Read Also: లొకేషన్ ముఖ్యం కాదు, ఫీలింగ్ ముఖ్యం.. జెన్‌జీ ‘ట్రావెల్’ ట్రెండ్
Follow Us On: X(Twitter)

