కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: అనాదిగా పాలకుల వివక్ష కారణంగానే పాలమూరు ప్రాంతం అభివృద్ధికి దూరమై శాపగ్రస్తంగా మారిందని తెలంగాణ ఉద్యమకారుడు వి. ప్రకాష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. గురువారం వనపర్తి (Wanaparthy) జిల్లా కేంద్రంలో తెలంగాణ వైతాళికుడు, పాలమూరు ముద్దుబిడ్డ సురవరం ప్రతాపరెడ్డి (Suravaram Pratapa Reddy) 130వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వి. ప్రకాశ్ మాట్లాడారు.
ఆసియాలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన సరళ సాగర్ ప్రాజెక్టు ద్వారా సైఫన్ సిస్టమ్‌ను వనపర్తికి తీసుకువచ్చి ఈ ప్రాంత వైభవానికి అనేక మంది మహానుభావులు కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ భారతదేశంలో విలీనం కాకముందే వనపర్తికి ప్రత్యేక చరిత్ర ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరులో ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 67 శాతం సారవంతమైన భూములు ఉన్నప్పటికీ, కృష్ణ, భీమా, తుంగభద్ర వంటి జీవనదులు పక్కనే ప్రవహిస్తున్నా గత పాలకులు ఆ నీటిని వినియోగించుకునే పరిస్థితులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలమూరు శ్రమజీవులకు చిరునామా అని, ప్రపంచవ్యాప్తంగా అనేక నిర్మాణ రంగాలలో పాలమూరు ప్రజలు పనిచేశారని తెలిపారు. గతంలో 14 లక్షల మంది వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు పునర్జీవం పొందిన పల్లెలు కనిపిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. వలస వెళ్లిన పక్షులు కూడా తిరిగి ఆవాసాలు ఏర్పరచుకుంటున్నాయని చెప్పారు. మన మూలాలు, చరిత్ర, వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలను పరిరక్షించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
చరిత్రను మరుగున పెట్టారు : ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకుడు ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, తమ చదువుకునే రోజులలో ఒక్క ఉపాధ్యాయుడు కూడా సురవరం ప్రతాపరెడ్డి గురించి చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్రను ఉద్దేశపూర్వకంగా మరుగున పెట్టారని ఆరోపించారు. “తెలంగాణ” అనే పదం మాట్లాడితేనే అవహేళన చేసేవారని, గోల్కొండ పత్రిక తెలంగాణ ప్రజలకు ఎందుకు అందుబాటులోకి రాలేదని ప్రశ్నించారు. “నమస్తే తెలంగాణ” వచ్చేవరకు తెలంగాణకు ప్రత్యేక పత్రిక లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రాథమిక హక్కులు, మానవ హక్కుల గురించి మాట్లాడినా అవహేళన చేసేవారని, ఆనాడే వ్యక్తిగత హక్కుల గురించి సురవరం ప్రతాపరెడ్డి మాట్లాడేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఫిర్యాదు చేయడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
సాదాసీదా జీవనం గడిపిన మహానుభావుడు : నిరంజన్ రెడ్డి
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, సంపన్న కుటుంబంలో పుట్టినా సాదాసీదా జీవనాన్ని గడిపిన మహానుభావుడు సురవరం ప్రతాపరెడ్డి అని కొనియాడారు. సమాజం పట్ల ఆయనకు నిరంతర సంఘర్షణ ఉండేదని పేర్కొన్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన సురవరం ప్రతాపరెడ్డి గురించి వందేళ్ల తర్వాత కూడా తెలంగాణ సమాజం మాట్లాడుకోవడం ఆయన చేసిన త్యాగానికి నిదర్శనమని అన్నారు. అనంతరం సురవరం పార్కులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజా మనోహర్, తంగిళ్ల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

