కలం ,మహబూబ్ నగర్ బ్యూరో: ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు పడి గాపులు కాయల్సి వస్తోందని, ఎవరినీ కదిలించినా కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. గురువారం మహబూబ్ నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి పంట తడిసి పోయిందన్నారు. రోహిణి కార్తె రావడంతో పంటలు వేసుకునేందుకు రైతులు సిద్ధం అవుతుంటే, కనీసం పిండి సంచులు కూడా అందుబాటులో లేవన్నారు.
పాలమూరు టెండర్లు రద్దు..
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు పిలిచిన టెండర్లను రద్దు చేశారు తప్ప, పనులు పూర్తి చేయలేదని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ప్రాజెక్ట్ పూర్తి చేయమంటే మంత్రులు తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నకిలీ పత్తి విత్తనాలను మార్కెట్‌లో రాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అన్నీ అందుబాటులో పెట్టామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రకమైన పాలన సాగిస్తే పోరాటం తప్పదన్నారు. గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, నాయకులు మల్లు నర్సింహా రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

