కేబీఆర్ పార్క్ పరిధిలో చెట్లు నరకొద్దు.. సుప్రీంకోర్టు ఆదేశం

కలం, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్) కేబీఆర్ పార్క్ (KBR Park) పరిధిలోని చెట్లను నరికవేయొద్దంటూ సుప్రీంకోర్టు (Supreme Court) ఆంక్షలు విధించింది. ఈ పార్కు ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఉన్నందున దాని చుట్టూ 25-35 మీటర్ల పరిధిలోని ఏ చెట్టునూ నరకవద్దని స్పష్టం చేసింది. స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (SRDP) కింద ఫ్లైఓవర్ల నిర్మాణం, మల్టీ లెవల్ కార్ పార్కింగ్, రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను తక్షణమే ఆపేయాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. రోడ్ల అభివృద్ధి పనుల కోసం చెట్లను నరికివేయడాన్ని సవాలు చేస్తూ కాజల్ మహేశ్వరి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

తగ్గిపోతున్న సెన్సిటివ్ జోన్ నిడివి

పార్కు చుట్టూ 25-35 మీటర్ల పరిధి ఎకో సెన్సిటివ్ జోన్‌గా ఉంటుందని సుప్రీంకోర్టు బెంచ్ గుర్తుచేసింది. ఉపశమనం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించింది. కేబీఆర్ పార్కు చుట్టూ అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో ఎకో సెన్సిటివ్ జోన్ దాదాపు 30 మీటర్ల మేర తగ్గిపోతుందని, ఇంత తక్కు బఫర్ జోన్ కారణంగా నేషనల్ పార్కు నిర్వహణ లక్ష్యమే దెబ్బతింటుందని పిటిషనర్ పేర్కొన్నారు. మరోవైపు ఈ పార్కు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం పరిధిలో కూడా నోటిఫై అయిందని, పర్యావరణ కోణం నుంచి చూస్తే ఇది హైదారబాద్ నగరానికి ఆక్సిజన్ అందించే ‘గ్రీన్ లంగ్ జోన్’గా ఉన్నదని పిటిషనర్ వివరించారు. నగరం నడిబొడ్డున ఉన్న సున్నితమైన అటవీ ప్రాంతమని గుర్తుచేశారు. మౌలిక సదుపాయాలను కల్పించే ప్రాజెక్టు పేరుతో రోడ్ల అభివృద్ధి పనులతో పార్కు చుట్టూ దాదాపు 35 మీటర్ల మేర ఎకో సెన్సిటివ్ జోన్ నిడివి తగ్గిపోతున్నదని, ఇది పర్యావరణానికి ముప్పుగా పరిణమించిందన్నారు.

హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్

కేబీఆర్ పార్కు (KBR Park) చుట్టూ అభివృద్ధి పనుల పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆపేయాలంటూ గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పార్కు పరిసరాల్లో నియంత్రణే లేని నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పర్యావరణానికి జరిగే కోలుకోలేని నష్టాన్ని నివారించాలని పిటిషనర్లు కోరారు. కానీ అనుకూల ఉత్తర్వులు రాకపోవడంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో జరిగిన విచారణ సందర్భంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిపై వివరాలను సమర్పించాలని ఆదేశించింది.

పర్యావరణం దెబ్బతినడంపై శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం జరగలేదని, హేతుబద్ధత లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, పర్యావరణాన్ని రక్షించాలంటూ సుమారు 19 వేల మంది సంతకాలు చేసి అభ్యంతరాలు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రజాభిప్రాయ సేకరణలో అబ్జెక్షన్స్ వచ్చినా పెడచెవిన పెట్టిందని ఎస్ఎల్‌పీలో పిటిషనర్ పేర్కొన్నారు. తదుపరి విచారణ (జూలై 27) జరిగేంత వరకు చెట్ల నరికివేతను నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు జారీచేసింది.

Read Also: సీఎం రేవంత్‌పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>