epaper
Wednesday, February 18, 2026
epaper

అది అత్యాచారయత్నమే : సుప్రీం కోర్టు

కలం, వెబ్​ డెస్క్: బాలికపై లైంగిక దాడి కేసులో అలహాబాద్​ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పుపై, ఆ సందర్భంగా సదరు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కేసులో నిందితులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ జోయ్​మాల్యా బాగ్చీ, జస్టిస్​ ఎన్​వీ అంజారియాతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

వివరాలివీ..

ఉత్తరప్రదేశ్​లోని కాస్​గంజ్​లో (Kasganj Case) 2021 నవంబర్​లో ఓ మహిళ తన కుమార్తె(11)తో కలసి బంధువుల ఇంటి నుంచి సొంతూరికి బయల్దేరింది. మార్గమధ్యలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పవన్​, ఆకాశ్​ బైక్​పై వాళ్లకు ఎదురయ్యారు. బాలికను ఇంటి దగ్గర దింపుతామని బండిపై ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లిన తర్వాత బైక్​ను ఆపి, అమ్మాయిని సమీపంలోని కల్వర్టు కిందకు లాక్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. బాలిక దుస్తులను తొలగించేందుకు ప్రయత్నిస్తూ పైజామా దారాలను తెంచేశారు. ఎదపై చేయి వేసి అసభ్యంగా తాకారు. బాలిక కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కొంతమంది అక్కడకు వచ్చారు. దీంతో ఆ యువకులు పారిపోయారు.

దీనిపై లైంగిక దాడి, పోక్సో కేసు నమోదైంది. అనంతరం అలహాబాద్​ హైకోర్టు (Allahabad High Court) లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జడ్జి ఒకరు మాట్లాడుతూ దుస్తులు లాగడం, పైజామా దారాలు తెంచేయడం, వక్షోజాలను తాకడం అత్యాచారయత్నం లేదా అత్యాచారంగా పరిగణించలేమంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, కేసు కొట్టేశారు.

దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) సుమోటోగా తీసుకొని గతేడాది ఒకసారి విచారణ జరిపింది. అలహాబాద్​ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు సమర్థనీయం కాదని, అవి అమానవీయమని అప్పట్లో వ్యాఖ్యానించింది. ఆ తీర్పుపై స్టే విధిస్తూ, కేంద్రం, యూపీ గవర్నమెంట్​కు నోటీసులు కూడా ఇచ్చింది.

ఈ క్రమంలో బుధవారం మరో దఫా కేసును సుప్రీం విచారించింది. బాలిక దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించడం, పైజామా దారాలను తెంచేయడం, ఎదను అసభ్యంగా తాకడం అత్యాచారయత్నమేనని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇలాంటి కేసుల్లో అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని భోపాల్​లోని నేషనల్​ జ్యుడిషియల్​ అకాడమీ(ఎన్​జేఏ)ని కోరింది. ఓ కమిటీని వేసి గైడ్​లైన్స్ రూపొందించి, మూడు నెలల్లోగా అందజేయాలని సూచించింది.

Read Also: వివాదాల ‘ఇంపాక్ట్’.. ఏఐ సమ్మిట్​లో రోబో డాగ్​ రభస

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>