epaper
Wednesday, February 18, 2026
epaper

తలాక్​ ఎ హసన్​పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​డెస్క్​: ముస్లిం చట్టంలోని ‘తలాక్​ ఎ హసన్’​ (Talaq e Hasan) పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై దాఖలైన వివిధ పిటిషన్లను బుధవారం అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా వర్చువల్​ (వాట్సాప్​, ఈమెయిల్​) తలాక్​​ పై ఆందోళన వ్యక్తం చేసింది.

ముస్లిం షరియా చట్టం ప్రకారం.. విడాకులు ఇచ్చే పద్ధతుల్లో మొదటిది ట్రిపుల్​ తలాక్​. ఈ విధానంలో భర్త మూడుసార్లు వెంట వెంటనే భార్యకు తలాక్​ అని చెప్తే వారి మధ్య బంధం తెగిపోయినట్లే. ఈ పద్ధతిని భారత ప్రభుత్వం ఐదేళ్ల కిందట రద్దు చేసింది. ఇక రెండోది తలాక్ ఎ హసన్​. ఇందులో భర్త నెలకోసారి చొప్పున వరుసగా మూడు నెలలు భార్యకు తలాక్​ చెప్పడం ద్వారా విడాకులు పొందొచ్చు.

ఈ విధానంపై జర్నలిస్ట్​ బేనజీర్​ హీనా (Benazir Heena) దాఖలు చేసిన పిటిషన్‌ను మొదట ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ జోయ్​మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం విచారించింది. భర్త తన ఇంటి చిరునామాకు కాకుండా వేరే చోటుకు తలాక్​ నోటీస్​ పంపారని, అందువల్ల ఇది చెల్లదని ప్రకటించాలని పిటిషనర్​ విన్నవించారు. దీనిని భర్త తరఫు న్యాయవాది ఖండించారు. సరైన అడ్రస్​కే పంపామన్నారు. ఈ కేసు సంక్లిష్టతను గుర్తించిన న్యాయస్థానం.. పరిష్కారానికి మధ్యవర్తిగా సుప్రీం మాజీ జస్టిస్ కురియన్ జోసెఫ్‌ను నియమించింది. నాలుగు వారాల్లోగా వివాదాన్ని పరిష్కరించేలా చూడాలని ఆయన్ను కోరింది. అంతవరకు తలాక్ ​అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

మరో కేసులోనూ తలాక్​ ఎ హసన్ (Talaq e Hasan) అమలును సుప్రీం నిలిపివేసింది. చదువురాని భార్య నుంచి ఖాళీ కాగితంపై సంతకాలు తీసుకుని తలాక్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని ఖండించేందుకు భర్త కోర్టుకు రాకపోవడం ధర్మాసనం గమనించింది.

‘తనపై వచ్చిన ఆరోపణలను భర్త ఖండించలేదు. కాబట్టి తలాక్ ఎ హసన్ అమలును నిలిపివేస్తున్నాం. చెల్లుబాటు అయ్యేలా తలాక్ ఇచ్చినట్లు భర్త నిరూపించే వరకు ఇద్దరూ చట్ట ప్రకారం భార్యాభర్తలే’ అని కోర్టు (Supreme Court) పేర్కొంది.

వర్చువల్​ తలాక్​లు ఆందోళనకరం..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 15 (వివక్ష నిషేధం), ఆర్టికల్ 21 (జీవన, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు)లను తలాక్ ఎ హసన్ ఉల్లంఘిస్తోందని దాఖలైన మరో పిటిషన్‌నూ న్యాయస్థానం విచారించింది.

ఇమెయిల్, వాట్సాప్, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా భర్త తలాక్ ఇచ్చినట్లు పేర్కొన్న మహిళ, ఇలా అన్యాయపు తలాక్​తోపాటు ప్రతీకార క్రిమినల్​ కేసులు, పోలీసుల పక్షపాతం వల్ల నష్టపోయిన ముస్లిం మహిళలకు రక్షణ కల్పించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది. ఈ పిటిషన్​ విచారణ సందర్భంగా వర్చువల్​ తలాక్​లపై ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం తలాక్​ ఎ హసన్‌పై వచ్చిన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి పంపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది.

ఈ సందర్భంగా ‘సమాజం మొత్తానికి సంబంధించిన అంశం ఇది. తీవ్ర వివక్ష కలిగించే ఆచారాలు ఉంటే కోర్టు జోక్యం చేసుకోవాల్సిందే’ అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.

Read Also: డాక్టర్​ శ్రీలీల.. ఎంబీబీఎస్​ పట్టా అందుకున్న నటి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>