కలం, వెబ్ డెస్క్ : మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసు (Margadarsi Case)లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా రామోజీరావు మరణించినందున కేసును ముగించాలని మార్గదర్శి తరపు న్యాయవాది కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ వ్యక్తి మరణించినంత మాత్రాన సంస్థపై ఉన్న క్రిమినల్ చర్యలు ఆగిపోవని స్పష్టం చేసింది.
బాధితులకు న్యాయం చేసే క్రమంలో అవసరమైతే ఆస్తులను జప్తు చేసి పంపిణీ చేసే అధికారం తమకు ఉందని హెచ్చరించింది. అయితే డిపాజిటర్లందరికీ నగదు చెల్లింపులు పూర్తయ్యాయని కంపెనీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ అంశంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని మార్గదర్శి చైర్మన్ చెరుకూరి కిరణ్ తో పాటు ఆర్బీఐ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15వ తేదీకి వాయిదా వేసింది.

