కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో అక్షర్ పటేల్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపిన టీమిండియా వ్యూహాన్ని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సమర్థించారు. కేఎల్ రాహుల్ కంటే అక్షర్‌ను ముందు పంపడంలో తప్పేమీ లేదన్నారు. ఇలాంటి ప్రయోగాలు కొన్నిసార్లు ఫలిస్తాయని, మరికొన్నిసార్లు విఫలమవుతాయని అభిప్రాయపడ్డారు. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 39 పరుగులకే గిల్, కోహ్లీ, రోహిత్ వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఐదో స్థానంలో వచ్చిన అక్షర్ ఏడు పరుగులకే ఔటయ్యాడు. దీంతో భారత్ 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
అయితే ఎడమచేతి వాటం బ్యాటర్ క్రీజులోకి వస్తే బౌలర్లు తమ లైన్, లెంగ్త్ మార్చుకోవాల్సి ఉంటుందని గవాస్కర్ వివరించారు. ఆ మార్పు తర్వాత వచ్చే కుడిచేతి బ్యాటర్‌కు అనుకూలంగా మారుతుందని చెప్పారు. అక్షర్ పరుగులు చేసి ఉంటే ఇదే వ్యూహాన్ని అద్భుతమైన కెప్టెన్సీగా ప్రశంసించేవారని పేర్కొన్నారు. గతంలోనూ కీలక మ్యాచ్‌ల్లో అక్షర్‌కు బ్యాటింగ్ ప్రమోషన్ ఇచ్చారు. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.
అక్షర్ ఔటైన తర్వాత రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. శ్రేయస్ 30 పరుగులు చేశాడు. వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి భారత్ 26 ఓవర్లలో 113/7 చేసింది. డీఎల్‌ఎస్ పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.

