మహిళల అండతోనే సీఎం అయ్యా: రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: మహిళలు అండగా నిలిచారు కాబట్టే తెలంగాణకు ముఖ్యమంత్రిని అయ్యానని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. కొడంగల్ లో రెండో రోజు రేవంత్ రెడ్డి పర్యటించిన సీఎం జూనియర్ కాలేజ్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసి ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో మహిళా సంఘాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా దీపావళి కానుకగా 4.50 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేశారు.

తదనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.. దీపావళి పండుగ ఉన్నప్పటికీ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మహిళలందరికీ రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. “మీరే నా కుటుంబం, నా ఆత్మబంధువులు, మహిళల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగాను” అని సీఎం అన్నారు. జీవితంలో ఇక తాను ఆశించేది ఏమీ లేదని, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, 2034 నాటికి ఈ సంఖ్యను కోటికి చేర్చడంతో పాటు కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం వెల్లడించారు. మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాకుండా వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన సూచించారు.

మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని, తద్వారా ప్రతి సంవత్సరం రూ.15 నుంచి రూ.20 కోట్ల వ్యాపారాన్ని మహిళలు నిర్వహించే అవకాశం కల్పించామని వివరించారు. పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లోనూ మహిళలను భాగస్వాములను చేశామన్నారు. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించామని చెప్పారు.

దీపావళి కానుకగా రాష్ట్రంలో 4.50 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేశామని, వాటిలో 3.50 లక్షల పెన్షన్లు ఒంటరి మహిళలు, వితంతువులకు కేటాయించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రతిరోజూ 37 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని, ఈ పథకం కోసం ప్రభుత్వం ఆర్టీసీకి నిధులు చెల్లిస్తూ సంస్థను లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. మహిళల సంతోషమే తన సంతోషమని, వారి అభివృద్ధి కోసమే తాను నిరంతరం పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మహిళల పిల్లల చదువులపై తనకు కూడా ప్రత్యేక శ్రద్ధ ఉందని, ఆడబిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సొంత చెల్లి జైలు నుంచి వస్తే అక్కున చేర్చుకోకుండా ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>