కలం, వెబ్ డెస్క్: అమెరికాలోని సియాటిల్ సెంటర్ ఆర్మరీలో జరుగుతున్న దీపావళి (Seattle Diwali) సంబరాల్లో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. కన్జర్వేటివ్ యాక్టివిస్టులు, ట్రంప్ మద్దతుదారులు జేక్ లాంగ్, థామస్ అలెన్‌లు వేడుక ప్రాంతంలోకి చొరబడి భారతీయులు, హిందువులకు వ్యతిరేకంగా నిరసన తెలపడం కలకలం రేపింది. ఈ సందర్భంగా వారు “హిందువులు అమెరికాను వదిలి వెళ్ళాలి”, “క్రైస్తవుల స్థానంలో హిందువులు రావడాన్ని ఆపాలి” అని రాసి ఉన్న వివాదాస్పద ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
అమెరికా సంస్కృతిని దేవుళ్లను పూజించేవారు, H-1B వీసాదారులు దెబ్బతీస్తున్నారంటూ నిరసనకారులు ఆందోళన చేశారు. అమెరికాలో క్రిస్టియానిటీని అంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అయితే పండుగ వేడుకలో నిరసన ప్రదర్శనను అక్కడున్న ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నినాదంతో ఈ వారాంతంలో నగరంలోని మరికొన్ని చోట్లకూ వెళ్తామని నిరసనకారులు స్పష్టం చేశారు.
కాగా, సమాజంలో శాంతియుతంగా జరుగుతున్న సాంస్కృతిక వేడుకపై జరిగిన ఈ ఘటనను స్థానిక నివాసితులు, పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. పండుగ వాతావరణంలో ఇలాంటి విద్వేషపూరిత చర్యలకు తావులేదని, భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మతపరమైన పండుగలను భంగపరచడం సరికాదని వ్యాఖ్యానించారు.

