ఇందిరమ్మ ఇళ్ల 3, 4వ విడతల మంజూరుపై మంత్రి ప్రకటన

కలం, ఖమ్మం బ్యూరో : పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్ళని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) అన్నారు. ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా ”మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి” కార్యక్రమంలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామంలో మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి పాల్గొని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ఆడబిడ్డల ఇళ్లలో దీపావళి పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గూడెం, ప్రతి తండా, ప్రతి గ్రామ పంచాయతీల్లో మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి పండుగను ప్రతి ఆడబిడ్డ ఘనంగా జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ పేదవాళ్ళ కళ్లల్లో కన్నీరు కారకుండా, ఒక చిన్న కోరికతో సొంత ఇల్లు కట్టించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్‌లో 1 లక్ష ఇళ్లు చొప్పున, ఇప్పటివరకు రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 లక్షల ఇళ్లను ఆడబిడ్డల పేరున మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. మొదటి విడతలో మంజూరైన ఇళ్లలో ఇప్పటివరకు 2,21,500 ఇళ్ల నిర్మాణాలు ఈ దీపావళి నాటికి పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు.  మొదటి దీపావళిని ‘నా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ అనే కాన్సెప్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గూడెంలో, ప్రతి తండాలో, ప్రతి వార్డులో, డివిజన్లలో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సెల్ఫీ కార్యక్రమాలను కూడా ఘనంగా ఏర్పాటు చేశామన్నారు.

పేదవాడికి ఆత్మధైర్యం, ఆత్మస్థైర్యం కల్పించాలనే ఉద్దేశంతో, వారి చిన్న కోరికను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని, ఇప్పటివరకు రెండు విడతలుగా ఇళ్లు ఇవ్వగా, త్వరలోనే మూడు, నాల్గవ విడతలను కూడా ఇస్తామని స్పష్టం చేశారు. ఇళ్ల కేటాయింపుల్లో ఎలాంటి కులం, మతం, పార్టీ భేదాలు చూడకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు అందించామని, భవిష్యత్తులోనూ మూడో, నాల్గవ విడతల్లో కూడా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ 40 వేల కోట్ల రూపాయలు పేద ఆడబిడ్డల ఇళ్ల నిర్మాణాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చామని, ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా, ఒక్క పైస అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పంపిణీ చేశామని మంత్రి అన్నారు.

భవిష్యత్తులో ఎవరెన్ని అవాకులు, చెవాకులు పేలినా పేదవాడి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ ఇందిరమ్మ ఇళ్లలోని పేద ఆడబిడ్డలందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి పక్షాన, స్వయంగా తన పక్షాన మంత్రి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ వినయేందర్ రెడ్డి, ఎంపిడివో రవికుమార్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>