కలం, వెబ్‌డెస్క్: నేటి కాలంలో యువత తమ బాహ్య సౌందర్యానికి, చర్మ సంరక్షణకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఈ వేసవిలో సీజన్‌లో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడం యువతకు సవాల్‌గా మారింది. తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లడం వలన సూర్యుడి నుండి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల (UV Rays) నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి మన శరీరం ‘మెలనిన్’ అనే పిగ్మెంట్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో మన ముఖం, కాళ్లు, చేతులు నల్లగా మారిపోతాయి.
ఈ సమ్మర్ టాన్ ను రిమూవ్ చేసుకునేందుకు మనం ఖరీదైన క్రీములు వాడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. మనం కొన్ని చిట్కాలతో సహజంగానే ఈ టాన్ ను తొలగించి చర్మాన్ని (Skin Care) మెరిసేలా చేసుకోవచ్చట. సమ్మర్ టాన్ ను తగ్గించుకునేందుకు నిపుణులు చెప్పిన కొన్ని సూచనలు తెలుసుకుందాం.
కలబంద జెల్
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కలబంద కీలక పాత్ర పోషిస్తుంది. తాజా కలబంద ఆకు నుండి తీసిన జెల్‌ను ముఖానికి, చేతులకు మందంగా పూసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో కడిగేయాలి. ఇది ఎండ వల్ల కలిగే చికాకును తగ్గించి, చర్మం పాత రంగును తిరిగి తెస్తుంది. కలబందలోని అలోయిన్ అనే సమ్మేళనం మెలనిన్ ఉత్పత్తిని నియంత్రించి, నల్ల మచ్చలు మరియు పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పసుపు – పెరుగు ప్యాక్
పుసుపు, పెరుగు కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల సాదా పెరుగులో చిటికెడు పసుపు కలిపి, నల్లబడిన భాగాలపై పూయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం మృత కణాలను తొలగించే సహజ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. పసుపులోని కర్కుమిన్ అనే యాంటీఆక్సిడెంట్ చర్మం నల్లబడటాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుందంటున్నారు నిపుణులు.
తేనె – నిమ్మరసం మిశ్రమం
ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని, ఒక టీస్పూన్ స్వచ్ఛమైన తేనెతో కలిపి నల్ల మచ్చలపై రాయాలి. 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేసి మొండి నల్ల మచ్చలను తొలగిస్తుంది. తేనె చర్మాన్ని పొడిబారకుండా తేమగా ఉంచుతుంది.
టమాటా రసం
చర్మం నలుపును తగ్గించేందుకు టమాటా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సగం టమాటాను బాగా మెత్తగా చేసి, ఆ రసం, గుజ్జును నేరుగా ముఖానికి, చేతులకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి. టమోటాలలో ఉండే లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, సూర్యరశ్మి వల్ల కలిగే చర్మం నల్లబడటం, ఎరుపుదనం, టానింగ్‌ను తగ్గిస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.
వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే మీ ఇంట్లో సహజంగా చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఏ ఫేస్ ప్యాక్ లేదా జెల్ అయినా ముఖానికి నేరుగా పెట్టే ముందు, చెవి వెనుక భాగంలో లేదా చేతి లోపలి వైపు కొద్దిగా అప్లై చేయాలి. దానిని 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత చర్మాన్ని గమనించాలి. అక్కడ చర్మం ఎర్రబడటం, దురద, లేదా మంట పుట్టడం వంటివి జరిగితే ఆ చిట్కా మీకు పడలేదని అర్థం చేసుకోవాలని సూచన.

