ట్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

​కలం, కరీంనగర్ బ్యూరో: నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ట్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శనివారం పెద్దపల్లిలోని ట్రినిటీ కళాశాలలో మెగా జాబ్ మేళా (Mega Job Mela) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎస్ఆర్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.ఎస్. సమ్మయ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మేళాను ప్రారంభించారు.
​ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు 44 కంపెనీల భాగస్వామ్యంతో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐటీ, నాన్ ఐటీ, ఫైనాన్స్ తదితర రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు ఇదొక చక్కని వేదిక అని అన్నారు.

విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, విద్య ద్వారానే వ్యక్తిగత, సామాజిక, ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ​పోటీ ప్రపంచంలో యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని, తద్వారా కుటుంబాలకు, సమాజానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ యువత అభ్యున్నతికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ​ఈ మెగా జాబ్ మేళాకు వెయ్యి మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు హాజరై వివిధ కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అశోక్, ప్రిన్సిపాల్ గణేష్, వివిధ కంపెనీల ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>