కలం, స్పోర్ట్స్ : భారత పారా అథ్లెటిక్స్ సూపర్ స్టార్, పారాలింపిక్ ఛాంపియన్ సుమిత్ అంటిల్ (Sumit Antil) మరోసారి మైదానంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన 8వ ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్ ముగింపు రోజున ఆయన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పురుషుల జావలిన్ త్రో ఎఫ్-64 విభాగంలో హర్యానా తరఫున బరిలోకి దిగిన సుమిత్ అంటిల్.. ఊహించని రీతిలో ఈటెను ఏకంగా 74.82 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ముద్దాడారు.
ఈ పోటీలో సుమిత్ అంటిల్ విసిరిన భారీ త్రోకు మిగతా క్రీడాకారులు ఎవరూ దరిదాపుల్లో కూడా నిలవలేకపోయారు. మహారాష్ట్రకు చెందిన సందీప్ సర్గార్ 62.88 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని సొంతం చేసుకోగా.. రాజస్థాన్‌కు చెందిన సందీప్ 61.83 మీటర్ల ప్రదర్శనతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. టోర్నమెంట్‌లో సుమిత్ అంటిల్ చూపిన ప్రతిభ క్రీడాకారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

