కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్ అశోక్ నగర్‌లో వీధి కుక్కల బెడద తీవ్రస్థాయికి చేరుకుంది. కుక్కల స్వైర విహారంతో భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధానంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, రోడ్డుపై నడిచే మహిళలు స్థానికులు కుక్కల దాడి భయంతో బయటకు రావడానికి జంకుతున్నారు.
కుక్కలు గుంపులుగా వచ్చి ద్విచక్ర వాహనాలను వెంబడిస్తుండటంతో, చాలామంది కింద పడి గాయాలపాలవుతున్నారు. స్థానికంగా మాంసం విక్రయాలు జరగడం ఆ వ్యర్థాలను అక్కడే పడవేయడం వల్ల కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యర్ధాలు తిని కొన్ని కుక్కలు దుర్వాసన కలిగి చర్మ ఊడి పోయి వాడల్లో తిరుగుతున్నాయి.
డివిజన్లో సమస్య తీవ్రతరం కావడంతో 54వ డివిజన్ కార్పొరేటర్ గొట్టిముక్కుల ఉమారాణి వెంకట రమణ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆమె కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. డివిజన్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల బెడదను నివారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

