కలం, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి (Chandrasekhar Reddy) అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సమాచార హక్కు చట్టం – 2005 పై పీఐఓలకు, ఏపీఐఓలకు, అన్ని శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా, సమాచార కమిషనర్లు పీ.వీ.శ్రీనివాస్ రావు, దేశాల భూపాల్‌లు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సమాచార చట్టం అవగాహనా సదస్సుకు హాజరైన చంద్రశేఖర్ రెడ్డికి, కమిషనర్లు దేశాల భూపాల్, పీ.వీ.శ్రీనివాస్ రావులు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పూల మొక్క అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో సమాచారం అందుబాటులో ఉంటేనే ప్రజలకు ఉపయోగమని, ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును సమాచార హక్కు చట్టం ద్వారా కల్పించబడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలలో సమాచారం ప్రజలకు సంబంధించినదే అయినందున దానిని వారికి తెలుపడంలో అలసత్వ వైఖరి తగదని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాసేవకులం అన్న విషయాన్ని మరువరాదని సూచించారు. ఈ సందర్భంగా ఆయన సమాచార హక్కు చట్టంలోని 2 షెడ్యూళ్ళు, 6 చాప్టర్లు, 31 సెక్షన్ల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు సంబంధించి పీ.ఐ.ఓలు, ఏ.పీ.ఐ.ఓల సందేహాలకు తగిన సూచనలు అందించారు. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్, వ్యక్తిగతంగా అడిగే సమాచారం, ఇవ్వవలసిన సమాచారం, ఇవ్వకూడని సమాచారం, తదితర వాటి గురించి సవివరంగా తెలియజేశారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత పీఐఓలు, ఏపీఐఓలకు ఉందని అన్నారు.
సమాచార చట్టం ప్రకారం సమాచారాన్ని కోరే హక్కు ప్రతి పౌరునికి ఉండడంతో పాటు, రికార్డులను, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించే అధికారం కూడా ఉందని తెలిపారు. పౌరులు కోరినప్పుడే సమాచారం ఇవ్వడం కాకుండా, సమాచార హక్కు చట్టం, సెక్షన్ 4(1)బి ప్రకారం స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చేలా అధికార యంత్రంగాలు సమాయత్తం కావాలని సూచించారు. పబ్లిక్ అథారిటీ బాధ్యతలు, విధులు, నిర్వర్తించే పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు 4(1) బి రిజిస్టర్లను అప్డేట్ చేసుకోవాలని, వీటన్నిటిని ప్రజలకు తెలిసే విధంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం లక్ష మందికి సమాచారం అందించడం జరిగిందని తెలిపారు. మరో 15 వేల వరకు అప్పీల్స్ రాష్ట్ర సమాచార కమిషన్‌కు వస్తున్నాయని వివరించారు. ఇప్పటి వరకు 20 జిల్లాలలో రాష్ట్ర సమాచార కమిషన్ పర్యటించిందని, సుదీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉన్న పాత కేసులు అన్నింటిని పరిష్కరించడం జరిగిందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరుకున్న సమాచారాన్ని పొందే అవకాశం ఉన్నందున పిఐఓలు, అధికార యంత్రంగాలు ప్రజల పక్షాన ఆలోచించి అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉందని చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు.
సమాచార కమిషనర్ పీ.వీ.శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలు, ఉద్దేశ్యాలు, 4(1)b కింద ఇచ్చే సమాచారం తెలియజేస్తూ ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో వివరాలను అప్డేట్ చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగాలపై ఉందని సూచించారు. సమాచార హక్కు చట్టంలోని 6(3) కింద దరఖాస్తును చక్కగా చదివి ఆకళింపు చేసుకోవాలని, ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ సరైన రీతిలో స్పందిస్తే సెకండ్ అప్పీలేట్ అథారిటీ వరకు అప్పీల్స్ అన్నారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులు అనగానే అనేక మంది ఆందోళనకు గురి అవుతారని, ఎలాంటి అనుమానాలు, అపోహలకు గురి కాకుండా దరఖాస్తుదారు కోరిన మేరకు రికార్డులలో ఉన్న సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు పెండింగ్ కేసులను ఆర్.టీ.ఐ కమిషన్ చీఫ్ కమిషనర్, కమిషనర్లు పరిశీలించి పరిష్కరించారు.
రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలు భారతదేశంలో అమలు చేస్తున్న వివరాలు తెలియజేస్తూ అధికార యంత్రంగాలు, పిఐఓలు సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. 1766 లోనే స్వీడన్ దేశంలో సమాచార హక్కు చట్టం అమలు ప్రారంభమైందని, 2005 సంవత్సరంలో భారతదేశంలో ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ప్రపంచ దేశాల పరంగా చూస్తే ఆర్.టీ.ఐ అమలు విషయంలో భారతదేశం 4వ స్థానంలో ఉందని, దీని అమలును మరింత సమర్ధవంతంగా చేస్తూ మన దేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కేవలం కార్యాలయ విధుల్లో మాత్రమే కాకుండా ప్రతి ఉద్యోగి వ్యక్తిగత జీవితంలో కూడా పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి, నైతిక విలువలను పెంపొందించే ముఖ్యమైన చట్టమని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి కూడా కార్యాలయంలోని విధుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని సమాచార హక్కు చట్టం ఫిర్యాదులకు సకాలంలో స్పందించి వీలైనంత త్వరగా సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, బి.రాజ గౌడ్, వివిధ స్థాయిల జిల్లా శాఖల అధికారులు, జిల్లా, డివిజనల్, మండల స్థాయి అప్పీలేట్ అథారిటీలు, పీఐఓలు, ఏపీఐఓలు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

