నల్లగొండ ‘నిమ్మ’కు ఏమైంది..? నాడు లాభం.. నేడు భారం!

కలం, నల్లగొండ బ్యూరో: మార్కెట్‌లో నిమ్మ ధరలు (Lemon Prices) ఘాటెక్కాయి.. కానీ తోటల్లో సాగు మాత్రం చల్లబడింది. డిమాండ్ ఉన్నా దిగుబడి లేక.. పెట్టుబడి పెరిగినా లాభం దక్కక ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా రైతాంగం నిమ్మ తోటలను వదిలి, వరి వైపు అడుగులు వేస్తోంది. ఒకప్పుడు రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిచిన నకిరేకల్ నిమ్మ సాగులో పతనం దిశగా అడుగులు వేస్తోంది. గతంలో 30 వేల ఎకరాల్లో సిరిలు కురిపించిన తోటలు.. నేడు కేవలం 11 వేల ఎకరాలకే పరిమితమయ్యాయి. రోజుకు 20 వేల బస్తాలతో కళకళలాడిన నకిరేకల్ మార్కెట్.. నేడు 3 వేల బస్తాలు రావడానికే ఆయాసపడుతోంది. మార్కెట్‌లో నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ ఉన్నా.. తోటల్లో మాత్రం దిగుబడి శూన్యం. ఢిల్లీ, ముంబై నగరాల దాకా.. ఆఖరికి అరబ్ దేశాలకు సైతం ఎగుమతి అయ్యే నకిరేకల్ నిమ్మకు ఇప్పుడేమైంది..? మార్కెట్‌లో బస్తా ధర రూ. 2,700 పలుకుతున్నా రైతు ఎందుకు సంతోషంగా లేడు? దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సాగు విస్తీర్ణం.. మూడొంతులు ఎందుకు పడిపోయింది..? లాభాల పంటగా పిలిచే నిమ్మ.. రైతులకు ఎందుకు భారంగా మారింది? అన్న ప్రశ్నలు రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

30 వేల ఎకరాల నుంచి 11 వేలకు

గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 30 వేల ఎకరాలకు పైగా నిమ్మ సాగయ్యేది. దాదాపు 18 వేల మంది రైతు కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ సాగుపైనే ఆధారపడి బతికేవి. వాతావరణం అనుకూలించిన రోజుల్లో ఏడాదికి 3 లక్షల టన్నులకు పైగా నిమ్మ దిగుబడి వచ్చేది. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం నిమ్మ సాగు విస్తీర్ణం కేవలం 11,163 ఎకరాలకు పడిపోయింది. సాగు చేస్తున్న రైతుల సంఖ్య కూడా 8,165 కి పరిమితమైంది. నల్లగొండ జిల్లాలో 6211 మంది రైతులు 7427 ఎకరాల్లో నిమ్మతోటలు సాగు చేస్తుండగా, సూర్యాపేట జిల్లాలో 1364 మంది రైతులు 2954 ఎకరాలు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 490 మంది రైతులు 782 ఎకరాల్లో వరిపంట సాగు చేస్తున్నారు. నిజానికి ఒకప్పుడు ఆ ప్రాంతంలో అడుగుపెడితే పచ్చని నిమ్మ తోటలు.. వాటి నుంచి వచ్చే కమ్మని సువాసనలు స్వాగతం పలికేవి. ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నిమ్మ సాగుకు నకిరేకల్ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. కానీ కాలక్రమేణా ఆ పచ్చదనం వెలవెలబోతోంది. నిమ్మ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతుండటంతో.. మార్కెట్‌కు దిగుబడులు తగ్గి, ధరలు పెరిగినా రైతుకు మాత్రం ఆశించిన లాభాలు దక్కని పరిస్థితి ఏర్పడింది.

తగ్గిన దిగుబడి.. పెరిగిన డిమాండ్

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో నిమ్మకాయలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే తోటలు తగ్గిపోవడం.. దిగుబడులు లేకపోవడంతో మార్కెట్‌కు ఆశించిన స్థాయిలో కాయలు రావడం లేదు. గతంలో సీజన్ సమయంలో నకిరేకల్‌లోని ప్రభుత్వ నిమ్మ మార్కెట్‌కు రోజుకు 15 నుండి 20 వేల బస్తాలు(ఒక్కో బస్తా 25 కిలోలు) వచ్చేవి. కానీ, ప్రస్తుత సీజన్‌లో అది కనీసం 3 వేల బస్తాలు కూడా దాటడం లేదని అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టే దిగుబడి ఎంత ఘోరంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్‌కు సరఫరా తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. గతంలో బస్తా ధర రూ. 2వేలు ఉండగా, ఇప్పుడది రూ. 2,700 వరకు పలుకుతోంది. కొన్నిసార్లు ఈ ధరలు రూ. 200 నుండి రూ. 400 కి పడిపోయిన రోజులు లేకపోలేదు. ఈ ధరల అస్థిరత రైతులకు శాపంగా మారింది.

భారీగా పెరిగిన పెట్టుబడి వ్యయం

కోవిడ్ సమయం నుంచి నిమ్మ ధరలు పడిపోగా.. మరోవైపు ఎరువులు, పురుగుల మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దళారుల మాయాజాలం, మార్కెటింగ్ ఖర్చులు, రవాణా ఛార్జీలు పెరగడం వల్ల రైతులకు నికర లాభాలు దక్కకుండా పోయాయి. ఇదే సమయంలో సాగునీటి వసతులు (ప్రాజెక్టులు, చెరువులు నిండటం) పెరగడం, మార్కెట్‌లో వరికి ప్రభుత్వ మద్దతు ధర లభించడంతో రైతులు శ్రమ ఎక్కువగా ఉండే నిమ్మ తోటలను తొలగించి, సులువైన వరి సాగు వైపు దృష్టి మళ్లించారు. యంత్రాల వాడకం పెరగడం కూడా దీనికి తోడైంది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా నిమ్మకాయలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి నిమ్మకాయలు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, గుజరాత్, యూపీ, చెన్నై, కోల్‌కతా వంటి నగరాలకే కాకుండా విదేశాలకు (యూఏఈ) సైతం ఎగుమతి అవుతుంటాయి. ఇంతటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న పంట స్థానికంగా మరుగునపడిపోవడం విచారకరమని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>